Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 48

Story of Ahalya !

పృష్ట్వా తు కుశలం తత్ర పరస్పర సమాగమే |
కథాంతే సుమతిర్వాక్యం వ్యాజహార మహామునిమ్ ||

స|| తత్ర పరస్పర సమాగమే కుశలం పృష్ట్వా కథాంతే సుమతిః మహామునిం వ్యాజహార |

బాలకాండ
నలుబది ఎనిమిదవ సర్గము
( అహల్యాశాప వృత్తాంతము)

విశ్వామిత్రుడు రామ లక్శ్మణులతో కలిసి విశాల నగరము రాగా, అక్కడ మహారాజు అయిన సుమతి ముందుగా వెళ్ళి వారిని ఆదరించి అతిథి సత్కారములను చేసెను.

అక్కడ ఆ పరస్పర సమాగమనములో కుశలములను అడిగి చివర సుమతి మహాముని విశ్వామిత్రుని ఇట్లు అడిగెను. "మీకు శుభమగు గాక . ఈ కుమారులిద్దరూ దేవతలతో సమానమైన పరాక్రమము గలవారు, శార్దూలము వృషభముల సదృశముగానున్నవారు , గతిలో గజ సింహములవలె నున్నవారు, పద్మ పత్రములవలే విశాలమైన నేత్రములు కలవారు, ఖడ్గము ధనస్సు బాణములను ధరించినవారు, రూపములో అశ్వినీ దేవతలవలె నున్నవారు, యౌవ్వనమునకు తగిన వయస్సు కలవారు. వీరు దేవలోకమునుంచి వచ్చిన అమరులవలె నున్నవారు. ఆకాశములో సూర్యచంద్రుని వలె వీరు ఈ దేశమునకు భూషణము వలె నున్నవారు. భాగ్యవశముననే వీరు ఇచ్ఛటికి వచ్చినవారు. ఇచటికి కాలి నడకపై ఎట్లు వచ్ఛిరి ? వీరెవరు ఎందుకు వచ్చిరి ? శ్రేష్ఠమైన ఆయుధములను ధరించి ఎందుకు ఈ దుర్గమమైన అరణ్యమునుంచి వచ్చుచున్నారు ? అది అంతయూ వినుటకు కోరికగాఉన్నది".

మహరాజు సుమతి యొక్క ఆ మాటలను విని విశ్వామిత్రుడు తమ సిద్ధాశ్రమ నివాసము , రాక్షస వథ జరిగినదంతయూ చెప్పెను.

విశ్వామిత్రుని వచములను విని మహరాజు సుమతి దశరథపుత్రులు అతిథులుగా పొందినందుకు అత్యంత ఆనందముతో మహాబలవంతులు సత్కారమునకు అర్హులైన వారిద్దరినీ యథావిథిగా పుజించెను. పిమ్మట రామ లక్ష్మణులు ఇద్దరూ మంచి సత్కారములను అందుకొని, అచట ఒక రాత్రి గడిపి మిథిలకు పయనమైరి.

విశ్వామిత్రుడు మునులు అందరూ శుభకరమైన జనకునియొక్క నగరమైన మిథిలానగరమును చూచి బాగు బాగు అని కొనియాడుతూ పూజించిరి. అక్కడ రాఘవుడు మిథిలాసమీపములో నున్న పురాతనమైన నిర్జనుముగానున్న ఆశ్రమమును చూచి మునిపుంగవుని ఇట్లు అడిగెను. "ఓ భగవన్ ! ఆశ్రమలక్షణములతో వున్న ఈ ఆశ్రమము ఎందుకు మునివర్జితమైనది ? ఇది పూర్వము ఎవరి ఆశ్రమము ? అది వినుటకు కోరికగా నున్నది".

రాఘవుడు చెప్పిన ఆ వాక్యములని విని మహాతేజోవంతుడు, వాక్య విశారదుడు అయిన మహాముని విశ్వామిత్రుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను.
"ఓ రాఘవా ! నీవు అడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పెదను. ఈ ఆశ్రమపదము ఒక మహాత్ముని కోపకారణముగా శపించ బడినది. ఓ నరశ్రేష్ఠ! పూర్వము ఇది దేవతలచే పూజింపబడి దివ్య శోభలతో విలసిల్లుచూ ఉండెడి గౌతముని ఆశ్రమము. ఓ రాజపుత్ర ! పూర్వము ఆ మహాయశోవంతుడు అగు గౌతముడు అహల్యతో సహ చాలా సంవత్సరములు ఇచట తపస్సు చేశెను. ఆ గౌతమ ముని లేని సమయము చూచి సహస్రాక్షుడైన ఇంద్రుడు గౌతముని వేషములో వచ్చి ఆహల్య తో ఇట్లు పలికెను. "ఓ సుందరీ ! కోరికగలవారు ఋతుకాలములకు ప్రతీక్షచేయరు. నే నీతో సంగమించ కోరుచున్నాను". ఓ రఘునందన ! గౌతమ మునివేషమును ధరించినది దుష్టబుద్ధికల సహస్రాక్షుడని తెలిసికొని కుతూహలముతో మనస్సులో ఆలోచించెను. అప్పుడు కోరిక తీరిన పిమ్మట ఇంద్రునితో ఇట్లు పలికెను. " ఓ ప్రభో నేను కృతార్థురాలను. శీఘ్రముగా ఇచటినుండి వెళ్ళుము. ఓ ఇంద్రా నీ యొక్క నా యొక్క గౌరవములను నిలుపుము ". ఇంద్రుడు కూడా నవ్వి ఇట్లు పలికెను." ఓ సుందరీ !సంతోషము. వచ్చిన విథముగనే పోయెదను".

ఓ రామ ! ఆ సంగమము తర్వాత ఆప్పుడే గౌతమముని వచ్చు నేమో అని భయముతో ఇంద్రుడు త్వరగా ఆశ్రమమునుండి బయటకు వచ్చెను. అప్పుడు అతడు దేవదానవులకు అజేయుడు తపోబలసమన్వితుడు అగు మహాముని గౌతముడు ఆశ్రమములో ప్రవేశించుట చూసెను. తీర్థ జలములలో స్నానమొనరించి , అగ్నివలే తేజరిల్లు చున్న , కుశలను సమిథలను తీసుకు వచ్చుచున్న ఆ మునిపుంగవుని చూచి త్రస్తాసురుని చంపిన సురపతి ఇంద్రుడు వివర్ణవదనుడాయెను. అప్పుడు ఆ గౌతమ మహాముని , మునివేషము ధరించిన దుష్టవర్తన గల సహస్రాక్షుని చూచి కోపముతో ఇట్లు పలికెను."ఓ దుర్బుద్ధి కలవాడా ! నారూపము ధరించి చేయకూడని పని చేసినవాడవు. నీవు విఫలత్వము పొందెదవు గాక "! గౌతమునిచే కోపములో ఇట్లు చెప్పబడిన వెంటనే ఆ ఇంద్రునియొక్క వృషణములు భూమిపై బడినవి .

ఆ గౌతమ మహాముని అ విధముగా ఇంద్రుని శపించిన పిమ్మట అహల్యను కూడా శపించెను. " నీవు ఇక్కడ చాలా వేలకొలది సంవత్సరములు నివశించెదవు. ఈ ఆశ్రమములో వాయువునే భక్షిస్తో ఆహారములేకుండా , అన్ని భూతములకు అదృశ్యముగా తపముచేస్తూ నివశించెదవు. ఎప్పుడు అజేయుడు దశరథాత్మజుడు అయిన రాముడు ఈ ఘోరమైన వనమునకు వచ్చునో అప్పుడు నిజ స్వరూపము పొందెదవు. ఓ దుష్ఠవర్తన గలదానా ! ఆయన ఆతిథ్యముతో లోభ మోహములు పోయి సంతోషముతో నన్నుకలిసి నీ రూపమును ధరించెదవు.

మహాతపోవంతుడైన మహాతేజస్సుగల గౌతముడు అ దుష్ఠ చారిణితో అట్లు చెప్పి ఈ ఆశ్రమమును వదిలి సిద్ధులు చారణులు సేవించు హిమవత్ శిఖరములపై తపము ఆచరించెను.

|| ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో బాలకాండలో నలభైఎనిమిదవ సర్గ సమాప్తము ||

|| ఓమ్ తత్ సత్ ||

ఏవముక్త్వా మహతేజా గౌత మో దుష్ఠచారిణీమ్|
ఇమమాశ్రమముత్సృజ్య సిద్ధచారణసేవితే |
హిమవచ్ఛిఖరే పుణ్యే తపస్తేపే మహాతపాః ||

తా|| మహాతపోవంతుడైన మహాతేజస్సుగల గౌతముడు అ దుష్ఠ చారిణితో అట్లు చెప్పి ఈ ఆశ్రమమును వదిలి సిద్ధులు చారణులు సేవించు హిమవత్ శిఖరములపై తపము ఆచరించెను.

|| ఓమ్ తత్ సత్ ||

|| Om tat sat ||